Anil Ravipudi: మెగాస్టార్ మూవీ వస్తుంది అంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది. సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుంచి మామూలు హడావుడి ఉండదు. ఇప్పుడు మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ గారు గా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అయిపోతున్నారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ సినిమాకి రిలీజ్ టైం లో ఎలా అయితే ఒక ఊపు ఉంటుందో.. అనిల్ రావిపూడి సినిమాలకు కూడా అలాంటి ఉత్సాహమే కనిపిస్తుంది. ఎందుకంటే, అనిల్ ప్రమోషన్స్ విషయంలో ప్లానింగ్ మామూలుగా ఉండదు. ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూసేలా చేయడంలో అనిల్ రూటే సపరేటని చెప్పవచ్చు. ఇదిగో అలాంటి అనిల్ – మెగాస్టార్ కాంబినేషన్ లో మూవీ అంటే ఈ పాటికి పబ్లిసిటీ పీక్స్ లో ఉండాలి. కానీ, ఎందుకనో కూసింత వెనుకబడినట్టుగా కనిపిస్తోంది.
Anil Ravipudi: అభిమానుల్లో కూడా మూవీ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది. జనవరి 12 రిలీజ్ డేట్ వచ్చింది. కానీ, ఆ జోష్ మాత్రం ఇంకా రాలేదు. 8 రోజులు మాత్రమే ఉంది.. ఇప్పటికీ ట్రైలర్ రిలీజ్ కాలేదు. నయనతారతో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా విడుదలకు దగ్గర పడుతున్నా ట్రైలర్ రిలీజ్ కాలేదనే బాధ అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే, ఆ అసంతృప్తిని, బాధనూ తొలగించేలా ప్రమోషన్స్ అదరగొట్టబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆదివారం (జనవరి 4)న తిరుపతిలో ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. దీని తరువాత రిలీజ్ డేట్ వరకూ మూవీ ప్రమోషన్స్ ప్రతి రోజు.. ఒక్కో ఊరిలో జరిపేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
Anil Ravipudi: జనవరి 5న నెల్లూరులో సెలబ్రేషన్స్ చేయనున్నారు. 6న విశాఖపట్నం, 7న హైదరాబాద్, 8న తాడేపల్లిగూడెం, 9న అనంతపూర్, 10న వరంగల్, 11న బెంగళూరు.. ఇలా మొత్తం మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ తొమ్మిది రోజుల్లో రకరకాల యాక్టివిటీస్ చేయబోతున్నారు. అంటే ఆదివారం నుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకూ సినిమా గురించే అందరూ మాట్లాడుకునేలా ప్రమోషన్స్ తో హోరెత్తించనున్నారు. ఈ ప్రమోషన్ ఈవెంట్స్ అన్నీ అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటాయని, వీటిలో కొన్నిటికి చిరంజీవి, నయనతార ఎటెండ్ అవుతారని చెబుతున్నారు. అంటే, మూవీ ప్రమోషన్స్ విషయంలో అందర్నీ ఇన్వాల్వ్ చేస్తున్నట్టు అర్ధం అవుతోంది.
ఇక ఈ ఈవెంట్స్ మాత్రమే కాకుండా.. టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు అన్నిటినీ ఇప్పటికే రికార్డ్ చేశారనీ, అవన్నీ వరుసగా విడుదల కాబోతున్నాయని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే, అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీకి కొత్త తరహాలో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. మరి ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో.. వేచి చూడాల్సిందే.
